Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 55

Viswamitra obtains boons from Mahadeva !!

|| om tat sat ||

తతస్తాన్ అకులాన్ దృష్ట్వా విశ్వామిత్రాస్త్రమోహితాన్ |
వసిష్ఠశ్చోదయామాస కామధుక్ సృజ యోగతః ||

తా||ఆప్పుడు విశ్వామిత్రుని అస్త్రములచే చలింపబడి తత్తరపోయినవారిని చూచి " ఓ కామధేను ! యోగ్యులను సృజింపుము " అని ప్రొత్సహించెను.

బాలకాండ
ఏబదిఇదవ సర్గము

శతానందుడు విశ్వామిత్రుని కథ చెప్పసాగెను.

' ఆప్పుడు విశ్వామిత్రుని అస్త్రములచే చలింపబడి తత్తరపోయిన ఆశ్రమవాసులను చూచి వసిష్ఠుడు శబలను , " ఓ కామధేను! యోగ్యులను సృజింపుము " అని ప్రొత్సహించెను. ఆ కామధేనువు యొక్క హూంకారమునుండి రవితేజము కల కాంభోజులు , పొదుగునుండి శస్త్రములను ధరించి ఉన్న పప్లవులు ఉద్భవించిరి. అదేవిధముగా యోని దేశమునుండి యవనులు , శకృదేశమునుండి శకులు, రోమకూపమునుండి మ్లేచ్ఛులు, హారీతులు, కిరాతులు ( ఉద్భవించిరి). ఓ రఘునందన ! వారి చే తత్క్షణమే విశ్వామిత్రునియొక్క పాద గజ అశ్వ రథ సైన్యములు నాశనము చేయబడెను'.

మహాత్ముడైన వసిష్ఠుని వలన నాశనము చేయబడిన సైన్యమును చూచి వందమంది విశ్వామిత్రుని పుత్రులు కోపముతో వివిథ రకములైన ఆయుధములతో తపోధనుడైన వసిష్ఠునిపై పరుగెత్తుకొని వచ్చిరి. పూజ్యుడైన ఆ ఋషి హూంకారముతో వారిని భశ్మమొనర్చెను. ఆ హూంకారముతో ఆ విశ్వామిత్రుని సుతులు అశ్వ రథ పాదచారులతో సహా క్షణములో వసిష్ఠునిచే భశ్మము చేయబడిరి.

నాశనము చేయబడిన పుత్రులను బలములను చూచి మహాయశోవంతుడైన విశ్వామిత్రుడు సిగ్గుతో చింతాక్రాంతుడయ్యెను. అతడు సముద్రునివలె వేగము లేని వాడయ్యెను. కోఱలు తీసిన పామువలె గ్రహణము పట్టి తేజో విహీనుడైన సూర్యుని వలె నుండెను. చంపబడిన సుతులు సైన్యములతో ఱెక్కలు పోయిన పక్షివలె దీనముగా నుండెను.విశ్వామిత్రుడు గర్వము అణిగి, ఉత్సాహము పోయి నిర్వేదము పొందెను.

అతడు ఒక పుత్రుని రాజ్యమును క్షత్రధర్మముతో రాజ్యము పాలింపమని చెప్పి వనములకు పోయెను. అతడు కిన్నరులు నాగులు చే సేవింపబడిన హిమవత్పర్వత పార్శ్వములో వెళ్ళి మహాదేవుని ప్రసాదము కొఱకు తపము చేసెను.

పిమ్మట కొంత కాలము తర్వాత వృషభధ్వజుడు అగు వరదుడు మహాబలుడైన విశ్వామిత్రునకు దర్శనమిచ్చెను. "ఓ రాజన్ ! సంతుష్ఠుడనైతిని. చెప్పుము ఎందుకు తపస్సు చేయుచున్నావు. నీ కోరికను దెలుపుము. నీవు కోరిన వరముఇచ్చెదను". దేవునిచేత ఇట్లు చెప్పబడిన విశ్వామిత్రుడు మహదేవునకు నమస్కరించి ఇట్లు పలికెను "ఓ మహాదేవా సాంగో పాంగముగా ధనుర్వేదమును రహస్యమైన ఉపనిషదులను నాకు ప్రసాదించుడు. దేవతల దానవుల మహర్షుల గందర్వుల వద్ద ఏ ప్రతిభావంతమైన అస్త్రములు కలవో ఓ అనఘ! అవి నాకు ప్రసాదింపుడు. ఓ దేవ దేవా ! నీ ప్రసాదముతో నాకు కావలసిన కోరిక తీరును."

అప్పుడు ఈశ్వరుడు " అట్లే అగుగాక" అని చెప్పి వెళ్ళిపోయెను.

విశ్వామిత్రుడు మహాబలవంతుడు దర్పముచే విర్రవీగు వాడు. ఆ రాజర్షి అస్త్రములు పొంది ఇంకా పూర్తిగా గర్వము కలవాడయ్యెను. పర్వకాలమందు సముద్రమువలె పరాక్రమవృద్ధితో ఋషిసత్తముడగు వసిష్ఠుడు హతమైనట్లే తలచెను. పిమ్మట ఆ రాజు ఆశ్రమ పదమునకు పోయి అస్త్రములను ప్రయోగించెను. ఆ అస్త్రముల తేజస్సు వలన ఆ తపోవనము అంతా దగ్ధమాయెను.

ఆ ధీమతుడగు విశ్వామిత్రుని యొక్క చెలరేగుతున్న అస్త్రములను చూచి అచటి వందలకొలదీ మునులందరూ అన్నిదిక్కులలో పోయిరి. వసిష్ఠుని శిష్యులు అలాగే వేలకొలదీ మృగములు పక్షులు భయభీతులై ఆన్ని దిక్కులవైపు పోయిరి. మహాత్ముడైన ఆ వశిష్ఠ ఆశ్రమపదము శూన్యమాయెను. క్షణములో శ్మశానవాటిక లాగా నిశ్శబ్దము ఆవరించెను.

"భయపడకుడు భయపడకుడు" అని మరల మరల చెప్పుచూ వసిష్ఠుడు ఇట్లనెను " "ఈదినమున సూర్యుడు మంచుని నాశనముచేసినట్లు ఆ గాధేయుని నాశనము చేసెదను". ఈ విధముగా చెప్పి తపోనిథి అయిన వసిష్ఠుడు విశ్వామిత్రునితో కోపముతో ఇట్లు పలికెను. "చాలాకాలమునుండి వృద్ధిలోనున్న ఈ ఆశ్రమపదమును నాశనమొనర్చి దురాచారాము చేసితివి. అందువలన ఓ మూఢుడా నీవు ఇక ఉండవు "

ఈ విధముగా చెప్పి అతి క్రోధముతో ధూమము లేని కాలాగ్ని వలే ఒక యమదండము వలె నున్న తన దండముతో ఎదురు లేచెను.

|| ఈ విథముగా శ్రీమద్రామాయణములో బాలకాండలో ఎబది ఇదవ సర్గము సమాప్తము.||

|| ఓమ్ తత్ సత్ ||

ఇత్యుక్త్వా పరమకృద్ధో దండముద్యమ్య సత్వరః |
విధూమమివ కాలాగ్నిం యమదండ మివాపరమ్||

ఈ విధముగా చెప్పి అతి క్రోధముతో ధూమము లేని కాలాగ్ని వలే ఒక యమదండము వలె నున్న తన దండముతో ఎదురు లేచెను.

||ఓమ్ తత్ సత్||

 

|| om tat sat ||